పంట వ్యర్థాల దహనం నేలకునష్టం… వ్యవసాయ అధికారి సాయి కృష్ణ

రుద్రూర్ : పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి, గోధుమ, మొక్కజొన్న గడ్డి వంటి పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని రుద్రూర్ మండల వ్యవసాయ అధికారి సాయి కృష్ణ తెలిపారు. పొలాన్ని త్వరగా శుభ్రం చేయాలనే ఉద్దేశంతో రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం సరికాదని సూచించారు.

పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలకు అవసరమైన సేంద్రియ కార్బన్ పూర్తిగా నశించి భూమి సారం తగ్గిపోతుందని పేర్కొన్నారు. దీంతో నేల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గి, భూమి త్వరగా చవుడుబారే ప్రమాదం ఉందన్నారు. అలాగే వానపాములు, మేలు చేసే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి ఉపయోగకర సూక్ష్మజీవులు అధిక వేడి కారణంగా చనిపోతాయని వివరించారు. దీని ప్రభావంతో పోషకాల చక్రం దెబ్బతిని నేల జీవశక్తి క్షీణిస్తుందని తెలిపారు.

పంట వ్యర్థాల దహనం సమయంలో నత్రజని, గంధకం వంటి ముఖ్యమైన పోషకాలు వాయువుల రూపంలో వాతావరణంలోకి వెళ్లిపోతాయని, ఫాస్ఫరస్, పొటాషియం కూడా కొంత మేర నష్టపోతాయని చెప్పారు. ఫలితంగా రైతులు అధికంగా రసాయన ఎరువులపై ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

పదేపదే పంట అవశేషాలను కాల్చడం వల్ల మట్టి గట్టిపడి నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుందని, నేల కోతకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా భూమిపై ఉండే గడ్డి పొర తొలగిపోవడంతో నేల తేమ త్వరగా ఆవిరైపోయి పంటలకు ఎక్కువసార్లు నీరు అవసరమవుతుందని చెప్పారు.

పంట గడ్డిని తగలబెట్టడం వల్ల కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరుగుతుందని, ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్, కంపోస్టింగ్, రోటవేటర్ ద్వారా మట్టిలో కలియదున్నడం, హ్యాపీ సీడర్, సూపర్ సీడర్ వంటి ఆధునిక యంత్రాల వినియోగం, బయో-డీకంపోజర్ స్ప్రేల వినియోగం వంటి సుస్థిర పద్ధతులను అనుసరించాలని సూచించారు. పర్యావరణ హిత వ్యవసాయ విధానాలను పాటించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని రైతులకు పిలుపునిచ్చారు.