రుద్రూర్ : మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించే బోనాల పండగకు గ్రామ పెద్దలు, కుల సంఘాల సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పదేళ్ల క్రితం అప్పటి సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ కృషితో బోనాల పండగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ వతన్దార్, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర రావ్ దేశాయ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉదయం గజ్జలమ్మ దేవి గుడి వద్ద పూజలు నిర్వహించి బ్యాండ్ మేళాలతో పోతరాజులను తీసుకుని వస్తారు. అనంతరం గౌడ పెద్ద ఇంటి నుండి ఘటం తీసుకువస్తారు. గ్రామంలోని ప్రతి కుల సంఘం నుండి బోనాలతో మహిళలు గ్రామ వతన్దార్ వెంకటేశ్వర దేశాయ్ ఇంటి వద్దకు చేరుకుంటారు. ఇక్కడి నుండి బోనాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. మహలక్ష్మమ్మ దేవి, పోశవ్వ దేవి, గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యం సమర్పిస్తారు. గ్రామం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బందువులను, స్నేహితులకు పండగకు ఆహ్వనించి విందు భోజనం ఏర్పాటు చేస్తారు.
