నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా
ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండగలలో ఒకటైన షబ్-ఏ-బరాత్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 3 మంగళవారం రాత్రి దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం షాబాన్ నెల 15వ రాత్రి ఈ పండగను ఆచరిస్తారు. రంజాన్ మాసానికి సరిగ్గా 15 రోజుల ముందు వచ్చే ఈ పర్వదినానికి ఇస్లాంలో విశేష ప్రాధాన్యత ఉంది.
షాబాన్ మాసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని, షబ్-ఏ-బరాత్ రోజున భక్తితో ఆరాధించే వారి పాపాలన్నీ క్షమించబడతాయని విశ్వాసం. ఈ సందర్భంగా ముస్లింలు రాత్రంతా జాగారం చేస్తూ మసీదుల్లో ప్రత్యేక నమాజులు ఆచరిస్తారు. అల్లాహ్‌ను ఆరాధిస్తూ పాపమోచన కోసం ప్రార్థనలు నిర్వహిస్తారు.
అనంతరం ఖాబరస్థాన్ (కబ్రస్తాన్)కు వెళ్లి పూర్వీకుల సమాధులను సందర్శించి మగ్ఫిరత్ (మన్నింపు) కోసం దువాలు చేస్తారు. శుభాలు సమృద్ధిగా లభించాలని, షాబాన్ మాసంలో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా రంజాన్ మాసాన్ని స్వాగతించే విధంగా ఆత్మశుద్ధితో ముందుకు సాగాలని భక్తులు సంకల్పిస్తారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వీలైనన్ని ఎక్కువ ప్రార్థనలు చేసి దైవ సాన్నిధ్యాన్ని పొందేందుకు ముస్లిం సమాజం సన్నద్ధమవుతోంది.
