వీవోఏల సమ్మెకు బీజేపీ సంఘీభావం

రుద్రూర్ :  తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా ఆదివారం రుద్రూర్‌లో కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని బీజేపీ మండల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీవోఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. వీవోఏలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం కల్పించడంతో పాటు రూ.20 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వారిని SERP ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, ట్యాబ్‌లు మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన వీవోఏలకు కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా (సీసీలు) పదోన్నతులు ఇవ్వాలని, జీవో నెం.58ను సవరించాలని, ఉద్యోగ భద్రత కల్పించి పనిభారం తగ్గించాలని కోరారు.
2023లో అసెంబ్లీలో వీవోఏల సమస్యలపై మాట్లాడిన మంత్రి సీతక్క ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ వీవోఏల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీవోఏల డిమాండ్లను నెరవేర్చకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, మండల కోశాధికారి వి.రామరాజు, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్‌కుమార్, రేపల్లి సాయిప్రసాద్, యువ మోర్చా అధ్యక్షుడు కుమ్మరి గణేష్, కార్యదర్శి ఎర్రోళ్ల శ్రీనివాస్, కేవీడీ సాయిలు, మండల సీనియర్ నాయకులు వరప్రసాద్, కళ్యాణి, నాగారం చిన్న సాయిలు, ధర్మవరం వెంకటేష్, ఈశ్వర్, నితిన్, నారోజు శ్రీనివాస్, దామోజీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె శిబిరంలో నినాదాలు చేస్తున్న బీజేపీ  నాయకులు