పూర్వ  విద్యార్థుల ఆత్మీయ  సమ్మేళనం


కోటగిరి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1973–74 ఎస్ఎస్సి బ్యాచ్  పూర్వ విద్యార్థులు 52 ఏళ్ల అనంతరం ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  పూర్వ విద్యార్థి సిరిగంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు.
పదో తరగతి పూర్తయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర రంగాల్లో స్థిరపడిన సహచరులు చాలా కాలం తర్వాత ఒకేచోట కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు రాంరెడ్డి, తిరుపతిరెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. సుమారు 27 మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలోని మధుర క్షణాలను సెల్‌ఫోన్లలో బంధించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సిరిగంధం నాగేశ్వరరావు, లక్ష్మీనరసింహులు, జైరామ్, జితేంద్ర ప్రసాద్, పుప్పల సైదయ్య, కొల్లూరు కిషోర్‌బాబు, నిర్మల, నాగమణి, శైలజకుమారి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. గురువులు రామిరెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థులను అభినందించారు.