
రుద్రూర్ : ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే నేడు ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ మాసాయిపేట యాదగిరి స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బాన్సువాడ సెగ్మెంట్ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాదిగలంతా ఐక్యంగా ఉండి జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడాలని పిలుపునిచ్చారు. మనం కష్టపడి సాధించుకున్న వర్గీకరణ ఫలాలను సమాజంలో ప్రతీ మాదిగ కుటుంబానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యావంతులు ఉద్యమంలోకి ముందుకు రావాలి. మాదిగ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని, సమాజంలో చైతన్యవంతమైన పౌరులుగా ఎదగాలని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు, హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టిన సుదీర్ఘ ఉద్యమాలు, సాధించిన చారిత్రాత్మక విజయాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలి. రాబోయే రోజుల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ కి మాదిగలు బలమైన సైన్యంగా తయారవ్వాలని, రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అనంతరం వర్ని,పోతంగల్, చందూర్, రుద్రూర్, కోటగిరి మండలాల కు కొత్త ఇంచార్జీ లను 4 చొప్పున ఎన్నుకున్నారు. పనితీరుని బట్టి మండల అధ్యక్షులను త్వరలోనే ఎన్నుకుంటామని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ఇన్చార్జిలు ఎమ్మార్పీఎస్ బలోపేతానికి, మాదిగల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని యాదగిరి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ సోంపూర్ పోచిరాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బందెల సంజీవులు, విక్రం రాజ్, శేఖర్, సాయిలు, హరిదాస్ , శ్రీనివాస్ , రాజ వరప్రసాద్ , అశోక్, నితిన్, సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీస్ మండలాల ఇన్చార్జిలు వీరే
బాన్సువాడ నియోజక వర్గంలోని ఆరు మండలాలకు ఇన్చార్జీలను బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ సమక్షంలో ఎన్నుకున్నారు. రుద్రూర్ మండల ఇన్చార్జిలుగా జి.రాజు, ఎం. పోశేట్టి, జి. విక్రమ్ రాజ్, బి.సంజీవ్ కుమార్, పోతంగల్ మండల ఇన్చార్జిలుగా ఎన్. అశోక్, ఎన్. హరిదాస్, కె. సాయి, జి. జయరాం, కోటగిరి మండల ఇన్చార్జిలుగా జి. అశోక్, పి.లాలయ్య, కె. శ్రీనివాస్, కె. నితిన్, వర్ని మండల ఇన్చార్జిలుగా కె. సాయిలు, ఎం. కాశీరాం, ఎం. రవికుమార్, వి.కె. బాబు, చందూర్ మండల ఇన్చార్జిలుగా బి. దన్వల్, ఎం. గంగాధర్, సిహెచ్ గంగారాం, పి. అబ్బయ్యను ఎన్నుకున్నారు.
