
కోటగిరి :ప్రజాకవి, ప్రజాగాయకుడు స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి సోంపూర్ పోచారం మాట్లాడుతూ.. గద్దర్ తన పాటను ప్రజల గొంతుకగా, తన కళను సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలిచిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజానాయకుడిగా ఆయన నిలిచారన్నారు. గద్దర్ ఆలోచనలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజ మార్పు కోసం చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు లాలయ్య, నాయకులు శ్రీనివాస్, అశోక్ , పోశెట్టి, నితిన్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
