సీసీ కెమెరాలు, రోడ్డు భద్రతపై అవగాహన

రుద్రూర్: “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రూర్ ఎస్సై సాయన్న మాట్లాడుతూ … గ్రామ భద్రతలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు.

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

“నేను సైతం” సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గ్రామంలో చేపట్టినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రత, డ్రైవర్ పత్రాల ధృవీకరణపై సూచనలు ఇచ్చారు.

గ్రామంలో తగిన వెలుతురు లేని ప్రాంతాలు, నిఘా అవసరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. గ్రామ ప్రజలు పోలీసులకు సహకరించి భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు.