కొనసాగుతున్న వివోఏల సమ్మె

రుద్రూర్: తెలంగాణ ఐకెపి వివోఏ ఎంప్లాయిస్ అసోసియేషన్ (స్వతంత్ర యూనియన్) ఆధ్వర్యంలో  మండల కార్యాలయం ఎదుట వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివోఏలు ఆందోళన కొనసాగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వివోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే రెండేళ్లు గడిచినా ఇప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అసెంబ్లీ సాక్షిగా వివోఏల సమస్యలను ప్రస్తావించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదన్నారు.
గ్రామ సంఘాల ద్వారా కాకుండా సెర్ప్‌ నుంచే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పని భారం పెంచుతూ తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది వివోఏలను ఆదుకోవాలని కోరారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రజియా బేగం, స్వరూప, జిజియాబాయి, కమల, సావిత్రి, , రిజ్వానా, జ్యోతి, లలిత, గంగామణి తదితరులు పాల్గొన్నారు.