
కోటగిరి:: మండల కేంద్రంలో నిరవధిక దీక్షలు చేపడుతున్న ఐకేపీ వీవోఏలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి వీవోఏలతో కలిసి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకుడు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి సీతక్క వీవోఏలకు కనీసం రూ.28 వేల వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే శాఖకు మంత్రిగా కొనసాగుతున్న సీతక్క వీవోఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వీవోఏలతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేదంటే వారి ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్, సమీర్, నజీర్, కప్ప సంతోష్, శంకర్ గౌడ్, బేగారి మారుతి, ఉమాకాంత్, యోగేష్, దత్తు, మసూద్, వజాద్, రహీం వివిధ గ్రామాల వీవోఏలు పాల్గొన్నారు.

