పోతంగల్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ఎక్లారా హైస్కూల్ లో విధులు నిర్వహిస్తున్న పోతంగల్ మండలానికి చెందిన ఎం.నాగయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కామారెడ్డి కలెక్టరేట్ లో నాగయ్యను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్, డీఈఓ రాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి ప్రశంస పత్రం ,మెమొంటోను అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టియు నాయకులు మాట్లాడుతూ… సీనియర్ ఉపాధ్యాయుడు నాగయ్య కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం మద్నూర్ మండలానికి గర్వకారణమని అన్నారు. 1985లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన నాగయ్య 41 ఏళ్ల సర్వీసులో ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. స్కూల్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలు, మొక్కల పెంపకం నాగయ్య తన సొంత ఖర్చులతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే సామాజిక సేవలో సైతం ముందుంటారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుషాల్, పుట్ట శ్రీనివాస్, మద్నూర్, డోంగ్లి మండలాల అధ్యక్షులు శివరాం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
