మెరుగైన వైద్య సేవలు అందించాలి -ఎమ్మెల్యే పోచారం

హైదరాబాద్ : అస్వస్థతకు గురి అయిన బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.బిబాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించిన బాలింతలను  సోమవారం ఆయన పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హుమెరా ఫాతిమా (ఎల్లారెడ్డి), రుక్సనా (కొత్తబాది, బాన్సువాడ మండలం), జ్యోతి (గౌరారం, గాంధారి మండలం)ల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
  హుమెరా ఫాతిమా, జ్యోతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, రుక్సనాకు డయాలసిస్ చికిత్స కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఎమ్మెల్యేకు  వివరించారు.
అనంతరం చికిత్స పొందుతున్న ముగ్గురు బాలింతల కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.