
రుద్రూర్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రుద్రూర్ మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గాండ్ల మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే సీతక్క వీవోఏలకు కనీసం రూ.28 వేల నెలసరి వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క వీవోఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
వీవోఏలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు రవికిరణ్, పార్వతి ప్రవీణ్, కర్రోళ్ల వెంకటేష్ , నీరడి శివ వీరయ్య, ఐకెపి వివో ఏ లు పాల్గొన్నారు.
