

రుద్రూర్: సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియను అధికారులు, బీఎల్వోలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో సర్ పత్రాలు నింపుతున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు, నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఎవరూ ఇబ్బందులు పడకుండా అధికారులు, బీఎల్వోలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీఎల్వోలు, ప్రజలు పాల్గొన్నారు.
