
కోటగిరి : రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమమే తమ సంకల్పమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న పేర్కొన్నారు.కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి కోటగిరి దళిత జర్నలిస్టులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తూ, సమాజానికి మూల స్థంభమైన జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి అక్రిడిటేషన్ల విషయంలో న్యాయం చేయాలన్నారు. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే తేడా చూపకుండా ఆయా పత్రికలలో పని చేసే ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందించాలన్నారు. అదేవిదంగా హెల్త్ కార్డులు, వారి పిల్లల చదువులో పూర్తి శాతం రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. ప్రతీ జర్నలిస్టుకు ఇండ్ల స్థలాన్ని అందించి, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఉన్న దళిత, గిరిజన జర్నలిస్టులను ఏకం చేసి నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించనున్నట్లు అయన తెలియజేశారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు బేగరి రాములు, రాము, భీంరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
