రుద్రూర్ : నిజానిజాలు నిర్ధారించకుండా వార్తలను ప్రచురించడం జర్నలిజం కాదని, అలాంటి కథనాల వల్ల అమాయకులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని మీడియా గుర్తుంచుకోవాలని ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన మనోవేదనను వెల్లడించారు.
వివాహం జరిగిన నాటి నుంచి భర్త నుంచి అనేక ఇబ్బందులు ఎదురైనా, పిల్లలకు తండ్రి ఉండాలనే ఒక్క ఆలోచనతో సహనంగా భరించానని ఆమె తెలిపారు. కుటుంబ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా, భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఆశతో సంసారాన్ని కొనసాగించానని చెప్పారు. అయితే పరిస్థితులు మరింత దిగజారడంతో ఇటీవల పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత తనపై వేధింపులు మరింత పెరిగాయని, తనతో మాట్లాడే వారిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు.
మద్యం, గంజాయి మత్తులో భర్త మాట్లాడిన మాటలను కొన్ని టెలివిజన్ చానళ్లు, సోషల్ మీడియా వేదికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చేయడంతో తన కుటుంబం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. వైరల్ అవుతున్న వీడియోలో బాధితురాలిగా ఉన్న తన అభిప్రాయాన్ని ఒక్కసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు.
“నేను తప్పు చేసి ఉంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను సమాజంలో అవమానించేలా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? నా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ గౌరవం గురించి ఎవరూ ఆలోచించలేదా?” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
వార్తలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని, ఇరువైపుల వాదనలు వినడం మీడియా బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. కుటుంబ వివాదాల్లో మహిళల గౌరవం, పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
