
రుద్రూర్: మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో కృష్ణ చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చన చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగగా, భక్తులు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసిరావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
