మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ
..దరఖాస్తులకు ఆహ్వానం

కోటగిరి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో కోటగిరి గ్రామ పంచాయతీ వద్ద ఉచిత ఉపాధి శిక్షణ అందించనున్నట్లు గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ తెలిపారు. 19 నుంచి 45 యేళ్ల లోపు  వయస్సు 7 ఉండి , కనీసం 10వ తరగతి చదివిన నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
శిక్షణ పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుందని, ఇందులో ఉచిత భోజనం, శిక్షణ మెటీరియల్‌తో పాటు ఆర్‌ఎస్ఈటిఐ సర్టిఫికెట్  అందజేస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి ప్రారంభించేందుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించేందుకు ఎస్‌బీఐ ద్వారా సహకారం అందిస్తారని పేర్కొన్నారు.
శిక్షణలో ఉమెన్స్ టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ–మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగ్ తయారీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ, బ్యూటీ పార్లర్, పుట్టగొడుగుల పెంపకం, పాడి పరిశ్రమ వంటి కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  ఆసక్తి గల మహిళలు తమ పేర్లను వెంటనే కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.