
పోతంగల్ : మండలంలోని హెగ్డోలి గ్రామ శివారు లో బుధవారం రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. కె. ఇందుధర్ రెడ్డి సోయాచిక్కుడు, వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులకు పంట యాజమాన్యంపై పలు సూచనలు చేశారు.
సోయాచిక్కుడు : ఈ పంట ప్రస్తుతం 20–25 రోజుల దశలో ఉందని, ఈ సమయంలో ఎకరానికి 25 కిలోల యూరియాను పైపాటుగా వేయాలని సూచించారు. కలుపు నివారణకు ఇమజిథాపైర్+ఇమాజోమాక్స్ 40 గ్రాములు లేదా ఇమజిథాపైర్ 10 శాతం 250 మి.లీ లేదా ఫోమిసేఫ్+ఫ్లుజిఫాప్-పీ-బ్యూటైల్ 400–500 మి.లీ ఎకరానికి పిచికారీ చేయాలని తెలిపారు. రసం పీల్చే పురుగుల నివారణకు ఎసిఫేట్ లేదా ఫిప్రోనిల్ మందులను సూచించారు. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కనిపిస్తే 10 లీటర్ల నీటికి ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి పిచికారీ చేయాలని వివరించారు.
వరి : ఈ పంటలో ప్రస్తుతం నాట్లు, దుబ్బు దశ కొనసాగుతోందని పేర్కొన్నారు. నాట్లు వేసిన 2–3 రోజుల్లో ప్రెటిలాక్లోర్ 50 శాతం ఈసీని ఎకరానికి 400–600 మి.లీ ఇసుకలో కలిపి చల్లాలని సూచించారు. నాట్లు వేసిన 15–20 రోజుల తర్వాత మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ లేదా ట్రయూఫామోన్+ఇథాక్సీసల్ఫూరాన్ మందులను కలుపు నివారణకు వినియోగించాలని చెప్పారు.
కాండం తొలుచు పురుగు నివారణకు నారు పీకే వారం రోజుల ముందు నారుమడిలో కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు చల్లాలని, దుబ్బు దశలో కార్బోఫ్యూరాన్ లేదా క్లోరాన్ట్రనిలిప్రోల్ గుళికలను వినియోగించవచ్చని తెలిపారు. ప్రత్యామ్నాయంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పీని లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
శాస్త్రవేత్తతో పాటు ఎఈవో శంకర్, జగిత్యాల వ్యవసాయ కళాశాల రావెప్ విద్యార్థినులు, రైతులు ఉన్నారు.


