
రుద్రూర్ : మండల కేంద్రంలో బుధవారం బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. ప్రధాన రోడ్డుపై బైటాయించి కేంద్ర ప్రభుత్వం ఆనుసరిస్తున్న తీరును నిరసించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ ఆధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ వారికి అండగా నిలిచిన రాహుల్ గాంధీని ఆరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని విరమింపచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట ఆరుణ్, డీసీసీ కార్యదర్శులు పత్తి రాము, కర్క అశోక్, స్థానిక సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ నిసార్, ఏఎంసీ డైరక్టర్ పార్వతి ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోటగిరి మండల కేంద్రంలో…

కోటగిరి: లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రజల సమస్యలు, విద్యార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని ఆరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలపై దాడి అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ విమర్శించారు. ప్రజల గొంతును అరెస్టులతో అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన నిరసనలను అణచివేయడం దుర దృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, గంగాధర్ దేశాయ్, విండో చైర్మెన్ కూచి సిద్దు. జుబేర్, ఆఫ్టల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
