
పోతంగల్: ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) యాప్‌ను ఆగస్టు 6 నుంచి నిజామాబాద్ జిల్లాలో అమలు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి బి. నిషిత తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న రాష్ట్ర ఎరువుల బుకింగ్ యాప్‌ను నిలిపివేసి, ఇకపై అన్ని రకాల ఎరువుల విక్రయాలు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా రైతు ఫార్మర్ ఐడీ నమోదు, ఆధార్ ఈ-కేవైసీ, భూమి వివరాల అనుసంధానం, పంట ఎంపిక, ఎరువుల అవసరాల నమోదు, ప్రభుత్వం సిఫార్సు చేసిన ఎరువుల పరిమాణం (జీఎఫ్‌ఆర్) ఆధారంగా ఎరువుల ఎంపిక, విక్రయ నమోదు, క్యూ ఆర్ కోడ్ లేదా టోకెన్ ద్వారా లావాదేవీలు నిర్వహించనున్నట్లు వివరించారు.
రైతుల ఫార్మర్ ఐడీ, భూమి, పంట వివరాల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులను విక్రయించాలని ఎరువుల డీలర్లు, పీఏసీఎస్ సేల్స్‌మెన్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎరువుల నిల్వలు, విక్రయాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో డీలర్లు, పీఏసీఎస్ కేంద్రాలకు సహకరించి కొత్త విధానాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
