
హైదరాబాద్/బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన నిధులు, ఆధునిక పరికరాలు, వైద్య సిబ్బందిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కోరారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పలు ప్రతిపాదనలు సమర్పించారు.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, గర్భిణీలు–శిశువుల ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రులు, ప్రజలకు సేవలందిస్తున్న వైద్యశాలల్లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి పోచారం తీసుకెళ్లారు.
చందూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయిందని, పనులు పూర్తిచేసేందుకు అదనంగా రూ.40 లక్షలు మంజూరు చేయాలని కోరారు. వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కోటగిరి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తికావస్తున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బంది, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే తుది దశలో ఉన్న బాన్సువాడ 100 పడకల ఏరియా ఆసుపత్రికి ఐసీయూ, ఆధునిక వైద్య పరికరాలు, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ మాతా–శిశు ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
