రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీఛత్రపతి శివాజీ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి మరాఠా సామ్రాజ్య వీరయోధుడు, శ్రీఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జయంతి వేడుకలను హిందూ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నాయకులు మాట్లాడుతూ.. హైందవ స్వరాజ్య పరిరక్షణ కోసం శంభాజీ మహారాజ్ అపార త్యాగాలు చేశారని కొనియాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు సింహస్వప్నంగా నిలిచి మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. యువత శంభాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ గౌడ్, కుమ్మరి గణేష్, కృష్ణంరాజు, ఎముల గజేందర్, బెజగం వెంకటేష్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, తాటిపాముల హరీష్, అడప నవీన్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

