పోతంగల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోందని రచయిత నాగం సాయిలు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో తన కలం, గళం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహోన్నత కవి కాళోజీ అని కొనియాడారు.
‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అంటూ ప్రజల్లో దేశభక్తి, సామాజిక చైతన్యాన్ని రగిలించిన కాళోజీ.. ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ వంటి ఎన్నో గొప్ప రచనలు చేశారని తెలిపారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతిలోని గొప్పతనాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు.
ప్రజల కష్టాలు, బాధలు, సామాజిక సమస్యలను తన సాహిత్యంలో ప్రతిబింబిస్తూ అణగారిన వర్గాల గొంతుకగా కాళోజీ నిలిచారని నాగం సాయిలు అన్నారు. ఆయన సాహిత్యం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాళోజీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందని పేర్కొన్నారు.


