ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

పోతంగల్‌: ఎల్‌నినో ప్రభావం, నీటి ఎద్దడి, భూగర్భ జలాల మట్టం తగ్గుదలను దృష్టిలో ఉంచుకొని రానున్న యాసంగి సీజన్‌లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి నిషిత సూచించారు. పోతంగల్‌ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
జొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, శనగ వంటి తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చన్నారు. స్థానిక నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సాగునీటిని పొదుపుగా వినియోగించేందుకు తుంపర, బిందు సేద్య పద్ధతులను అనుసరించా లని తెలిపారు.
విద్యుత్‌ శాఖ ఏఈఈ రాజేష్‌ మాట్లాడుతూ.. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన అంశాలను వివరించారు. రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, అందుబాటులో ఉన్న విద్యుత్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో అరుణ్‌, రైతులు పాల్గొన్నారు.