
రుద్రూర్ : భూగర్భ జలాలను పరిరక్షించుకుంటూ, భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు రైతన్నలు సమాయత్తం కావాలని వ్యవసాయాధికారి సాయికృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని అంబం (ఆర్), చిక్కడపల్లి గ్రామాలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ‘పంట మార్పిడి’ , ‘ఎల్ నినో’ ప్రభావాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో చర్చించిన ముఖ్యాంశాలు:
* ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు: నిరంతరం వరి సాగు చేయడం వల్ల నేల సారం కోల్పోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే జొన్న , శనగలు , మరియు సూర్యకాంతి పువ్వు వంటి లాభసాటి పంటలను సాగు చేసే విధానంపై రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
* నీటి లభ్యత – పొదుపు చర్యలు: భవిష్యత్తులో నీటి వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున, రైతులు వృథాగా నీటిని ఖర్చు చేయకుండా తుంపర , బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
* ఎల్నినో ప్రభావం – ముందస్తు జాగ్రత్తలు: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణమైన ‘ఎల్నినో’ ప్రభావం గురించి అధికారుల బృందం వివరించింది. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు ముందస్తు ప్రణాళికలతో తక్కువ కాలపరిమితిలో వచ్చే పంటలను ఎంచుకోవాలని హితవు పలికారు. స్థానిక రైతులు తమ సందేహాలను అధికారుల ముందుంచగా, వారు సలహాలు, సూచనలతో నివృత్తి చేశారు. కార్యక్రమంలో చిక్కడపల్లి సర్పంచ్ మచుకూరి రమేష్, అంబం సర్పంచ్ కుర్లెమ్ గంగాధర్ , ఏఈవో వెంకటేష్ , రైతులు నాయకులు పాల్గొన్నారు.

