రుద్రూర్ : మండలంలోని అంబం (ఆర్) లో రెండు రోజుల పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన గజ్జెలమ్మ తల్లి పండగ ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పోతరాజుల విన్యాసాల మద్య రథాన్ని గ్రామంలోని శ్రీ హన్మాన్ మందిరం వరకు తెచ్చారు. ఈ సందర్భంగా హన్మాన్ మందిరం సమీపంలో జాతర సాగింది. జాతరకు సమీప గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏడాది వాన కాలం పంటలు వచ్చిన తరువాత రెండు రోజుల పాటు గజ్జెలమ్మ దేవి పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ కమిటి సభ్యులు పేర్కోన్నారు. గ్రామం పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని పండగ చేస్తామని వారు తెలిపారు. ఉత్సవాల్లో గ్రామాభివృద్ది కమిటి అధ్యక్షుడు రెంజర్ల గంగారాం, కార్యదర్శి గంగలి రాములు, ఉపాద్యాక్షుడు కమ్మరి లక్ష్మణ్, కోశాధికారి అసం రాము, మాజీ సర్పంచ్ కోర్వ బాగ్య భూష, ఎంపీటీసీ పట్టెపు రాములు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


