రుద్రూర్‌లో రామయ్య తలంబ్రాల పంపిణీ

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
● తలంబ్రాలు పొందడం అదృష్టమన్న భక్తులు
● భద్రాచలానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రుద్రూర్‌దే
● రామరాజు సేవలను కొనియాడిన భక్తులు



రుద్రూర్ : భద్రాచల సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలను మంగళవారం రుద్రూర్ గ్రామంలో పంపిణీ చేశారు. గ్రామంలోని విఠళేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులతో భజనలు నిర్వహించి తలంబ్రాల పవిత్రత, వాటి విశిష్టతను వివరించి అనంతరం భక్తులకు అందజేశారు. రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణం కోసం తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 300 కిలోల గోటి తలంబ్రాలను సమకూర్చి పంపినట్లు తెలిపారు. అందులో రుద్రూర్ గ్రామస్తుల పాత్ర విశేషమని పేర్కొన్నారు.

భద్రాచలం నుంచి 100 కిలోల ముత్యాల తలంబ్రాలను భక్తుల కోసం తీసుకువచ్చినట్లు తెలిపారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలానికి వెళ్లలేకపోయినా తమ గోటి తలంబ్రాలు అక్కడికి చేరాయని, తిరిగి ముత్యాల తలంబ్రాలను అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.

రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను భక్తులు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఇందూరు సునీతచంద్రశేఖర్,  ఆలయ కమిటీ సభ్యులు కౌలాస్ గంగాధర్, మోత్కూరి నారాయణ ,పారుపల్లి శ్రీరామ్ , ఆలయ అర్చకులు నారాయణరావు , ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు  పాల్గొన్నారు.