ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పిలుపు


రుద్రూర్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. రుద్రూర్ మండల కేంద్రంలో మోస్రా, చందూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాల పార్టీ బాధ్యులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలను ఆయన అభినందించారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడానికి ప్రధాని మోదీ సభ తొలి అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోదీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో సభకు హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. గత పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్‌కు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని దినేష్ కులాచారి విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. హిందూ సంస్కృతిపై దాడులు జరిగితే వెంటనే స్పందిస్తున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్, నియోజకవర్గ నాయకుడు శశాంక్ కోనేరు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, ఇల్తాం శంకర్, బీజేపీ మండలాధ్యక్షులు హన్మండ్లు, నవీన్, ఆలపాటి హరికృష్ణ, ఆవుల రమేష్, సర్పంచ్ లు గుత్ప భూపాల్ రెడ్డి, కుర్లేపు గంగాధర్, నాయకులు బీవీ గుప్తా, చిదురా మహిపాల్, వి . రామరాజు, ఏముల గజేందర్, బోజిగొండ అనిల్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, శ్రీనివాస్, తోట శంకర్, పార్వతి మురళి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
