రుద్రూర్ : మండలంలోని 11 గ్రామపంచాయతీల పరిధిలో ఫించన్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను ఆన్లైన్ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీవో బాలగంగాధర్ తెలిపారు. వివిధ గ్రామ పంచాయతీల ద్వారా 866 దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. వృద్ధాప్య ఫించన్ కోసం 322 మంది, దివ్యాంగుల ఫించన్ కోసం 47 మంది, వితంతువుల ఫించన్ కోసం 184 మంది, ఒంటరి మహిళల ఫించన్ కోసం 32 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా బీడీ కార్మికుల ఫించన్ కోసం 271 మంది, గీత కార్మికుల ఫించన్ కోసం ఏడుగురు, చేనేత కార్మికుల ఫించన్ కోసం ముగ్గురు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే అర్హులైన వారికి ఫించన్లు మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని ఎంపీడీవో తెలిపారు.

