కొనసాగుతున్న ఐకేపీ వివోఏల సమ్మె

కోటగిరి: తెలంగాణ ఐకెపి వివోఏ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివోఏలు  సమ్మె కొనసాగించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వివోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే రెండేళ్లు గడిచినా ఇప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అసెంబ్లీ సాక్షిగా వివోఏల సమస్యలను ప్రస్తావించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదన్నారు.
గ్రామ సంఘాల ద్వారా కాకుండా సెర్ప్‌ నుంచే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పని భారం పెంచుతూ తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది వివోఏలను ఆదుకోవాలని కోరారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

వివోఏల ప్రధాన డిమాండ్లు:

కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపచేయాలి.
అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు ఇవ్వాలి.
సాధారణ, ప్రమాద, ఆరోగ్య భీమాలను రూ.20 లక్షల వరకు కల్పించాలి. ట్యాబ్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం అందించాలి. జీఓ 58 సవరణ చేసి జాబ్ చార్ట్ ఇవ్వాలి.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తోట శ్రీకాంత్, మహాజన్ సందీప్ , సంఘం అధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షురాలు శోభ, కార్యదర్శి రాజు, కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శి శిరీషతో పాటు వివిధ గ్రామాల ఐకేపీ గ్రామ సంఘ సహాయకులు, మండల వివోఏలు పాల్గొన్నారు.