పోతంగల్: మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ యంత్రీకరణ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానైజేషన్ పథకం కింద లబ్ధి పొందిన రైతులకు ట్రాక్టర్‌తో నడిచే పరికరాలను శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రోటవాటర్లు, స్ట్రా బేలర్లు, మొక్కల సంరక్షణ పరికరాలను రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ హనుమంతు మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఆధునిక పరికరాలు అందించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తోందన్నారు.
సర్పంచ్ సంధ్య హన్మండ్లు మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి నిషిత రైతులకు పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విస్తరణ అధికారి సుప్రియ పథకం వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ యంత్రాల డీలర్లు పాల్గొన్నారు.

