కోటగిరి : పాలిసెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్లో భాగంగా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కోర్సులకు సంబంధించిన సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ పి. సుధాకర్ తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో 66 మంది, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో 62 మంది, మెకానికల్ ఇంజినీరింగ్లో 61 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు ఆయన వెల్లడించారు. తొలి విడతలోనే అన్ని విభాగాల్లో సీట్లు నిండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
అడ్మిషన్ పొందిన విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఈ నెల 8వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలిపారు.
కళాశాల ఆవరణలో బాలురకు హాస్టల్ వసతి అందుబాటులో ఉందని, హాస్టల్లో చేరదలచిన విద్యార్థులు రూ.3,230 చెల్లించి అడ్మిషన్ పొందవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


