కొత్త పెన్షన్లపై ప్రభుత్వం మాట తప్పింది : ఎన్‌పీఆర్‌డీ

బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త చేయూత పెన్షన్ల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. బోధన్‌లోని రాకశిపేట గ్రామాభివృద్ధి కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించిన ఎన్‌పీఆర్‌డీ నిజామాబాద్ జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. 2023 డిసెంబరులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో 11 రకాల చేయూత పెన్షన్ల కోసం 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని అన్నారు.
ప్రభుత్వ ప్రకటనలను నమ్మి లక్షలాది మంది మీ సేవా కేంద్రాల ద్వారా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకున్నారని, కానీ పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు పలు వేదికలపై జూన్ 2న కొత్త పెన్షన్లు అందజేస్తామని ప్రకటించి, అనంతరం మాట మార్చడం సమంజసం కాదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ పరిపాలన కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. కొత్త పెన్షన్ల పంపిణీకి వెంటనే తేదీ ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జూన్ 10న హైదరాబాద్‌లోని సెర్ప్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గైని రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి ముంజం సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు గాండ్ల గంగారం, ఆవుల సావిత్రి, శివప్రసాద్, సంగప్ప, గంగారాం, పటేల్, సాయినాథ్, జెల్లా అంజలి, ముత్యాలు, రజిత, కరుణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.