బాధితులకు నిత్యావసరాల పంపిణీ

కోటగిరి:  మండలం లోని ఎత్తోండ క్యాంప్ లో ఇటీవల కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్నారై కోనేరు శశాంక్ స్పందించి, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం బాధిత కుటుంబాలకు వారం రోజుల పాటు సరిపడే నిత్యావసర వస్తువులను అందజేశారు. ట్రస్ట్ ప్రతినిధులు గ్రామానికి వెళ్లి 12 కుటుంబాలకు బియ్యం, కిరాణా సరుకులు తదితర అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ బృంద సభ్యులు ఏముల నవీన్, నాగేల్లి శ్రీనివాస్, వడ్ల శ్యామ్, మామిడి సాయిలు, విలాస్, శ్యామ్, ఆలపాటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.