జూలై 1న నల్లజెండాలతో నిరసనలు  – 25, 26న బోధన్‌లో రాష్ట్ర సదస్సు

బోధన్, జూన్ 15: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వి.బి.జి.ఆర్.ఎం.జి-2025 విధానాన్ని రద్దు చేసి, నరేగా పథకాన్ని కొనసాగించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 1న దేశవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోమవారం బోధన్ పట్టణంలోని గ్రామ అభివృద్ధి కమిటీ కమ్యూనిటీ హాల్‌లో ఎన్‌పీఆర్‌డీ నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు గైని రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడివయ్య మాట్లాడుతూ, వి.బి.జి.ఆర్.ఎం.జి అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2006 నుంచి నరేగా చట్టం గ్రామీణ పేదలు, వికలాంగులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేయూత పెన్షన్‌ను రూ.4,016 నుంచి రూ.6,000లకు పెంచుతామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అలాగే కొత్తగా రెండు లక్షల మంది వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 25, 26 తేదీల్లో బోధన్ పట్టణంలో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు అడివయ్య తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొంటూ, సదస్సు విజయవంతానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా కార్యదర్శి యేశాల గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నజీర్, జిల్లా నాయకులు నాగనాథ్ పటేల్, గంగారాం, లక్ష్మణ్ సింగ్, రాజు, భూమయ్య, సద్దాం తదితరులు పాల్గొన్నారు.