ఇళ్ల అర్హుల వివరాల సేకరణ

రుద్రూర్ : మండల కేంద్రంలోని జేఎన్సీ, lఆర్ఎన్సీ కాలనీలో సోమవారం ఎంపీడీవో బాలగంగాధర్, హౌసింగ్ ఏఈ స్రవంతి,  పర్యటించి పేద కుటుంబాల పరిస్థితులను పరిశీలించారు. గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న కుటుంబాల వివరాలను తెలుసుకుని వారి నివాస పరిస్థితులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపొందించే ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే బేస్మెంట్ లేదా రూఫ్ లెవెల్ వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణ పనులు నిలిపివేసిన పేద కుటుంబాల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన కుటుంబాలు స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శిని సంప్రదించి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఎంపీడీవో బాలగంగాధర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వారితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ ఉన్నారు. అధికారులు చేపట్టిన ఈ పరిశీలనతో కాలనీవాసుల్లో ఆశలు చిగురించాయి.