

రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన కళ్యాణ మహోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ముగిశాయి. వైశాఖమాసం సందర్భంగా స్థానిక దేవాంగ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఆదివారం నిర్వహించిన దేవి శోభాయాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. యువకుల దండకాలు, భక్తుల భజన సంకీర్తనలు, మహిళల మంగళహారతులతో ప్రధాన వీధులు మార్మోగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు మొక్కవోని భక్తితో శోభాయాత్రలో పాల్గొన్నారు.


దేవి కళ్యాణోత్సవాలకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన చీరల వేలంపాటను సోమవారం మహిళా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారి చీరలను దక్కించుకునేందుకు మహిళలు ఉత్సాహంగా పోటీపడ్డారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరైన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విరాళాలు అందించిన దాతలకు దేవాంగ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా అమ్మవారి పండుగను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
