రైడ్స్ సేవలుఅభినందనీయం  -కొనియాడిన వక్తలు

రుద్రూర్: రెండేళ్ల క్రితం ఏర్పాటైన స్వచ్చంద సంస్థ ‘రైడ్స్’ చేపడుతున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. మండల కేంద్రంలో గత నెల రోజులుగా రైడ్స్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మండల విద్యాధికారి కట్టా శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మండల కేంద్రంలోని నాలుగు హైస్కూళ్లలో పదో తరగతిలో తొలి రెండు స్థానాలు సాధించిన ఏడుగురు విద్యార్థులను రైడ్స్ సభ్యురాలు, బోధన్ వంశీ హైస్కూల్ డైరెక్టర్ పద్మజ నగదు, ప్రోత్సాహకాలతో సత్కరించారు. స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థులకు రూ.2 వేల చొప్పున, సెకండ్ వచ్చిన వారికి రూ.1500 చొప్పున అందజేశారు. అదనంగా కాలేజీ బ్యాగులు, లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లను బహుమతులుగా ఇచ్చారు.

కార్యక్రమంలో   ప్రజాప్రతినిధులు, రైడ్స్ సీనియర్ సభ్యులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్వచ్చందంగా బోధనకు ముందుకు వచ్చిన ఉపాధ్యాయులకు, అల్పాహారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రైడ్స్ సంస్థ వేసవి శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా డ్రాస్అవుట్ పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం, మంచి మార్కులు సాధించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అభినందించడం, పై చదువులకు ప్రోత్సహించడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, సింగిల్ విండో మాజీ చైర్మెన్ పత్తి రాము, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ డౌర్ సాయిలు, లయన్స్ క్లబ్ చైర్మన్ కెవి మోహన్, హెడ్మాస్టర్లు రాంసింగ్ , పద్మావతి,  రైడ్స్ అధ్యక్ష, కార్యదర్శులు  కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, పార్వతి శేఖర్, కోశాధికారి చిదురమహిపాల్, రైడ్స్ సలహదారులు బెజగం వెంకటేశం, పద్మ ప్రదీప్, కౌలాస్ గంగాధర్, శరత్, కర్క అశోక్, ఉప్పు అశోక్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.