
కోటగిరి : రాష్ట్రంలో అక్రిడేషన్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డుల మంజూరులో దళిత, గిరిజన జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత, గిరిజన జర్నలిస్టుల ఆత్మగౌరవ పరిరక్షణే తమ సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ నెల 29వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని ఐ&పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాత్రికేయులు పుప్పల సైదయ్య, బి. రాములు, మోరే జీవన్, రాము, భీమ్రావు, అర్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
