
కోటగిరి : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ నాయకులు శనివారం కోటగిరి మండల కేంద్రంలో ఆటోకు తాడుగట్టి లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, మండల కార్యదర్శి ఏ.విఠల్ గౌడ్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు పెట్రో ధరలు పెరగవని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఫలితాల అనంతరం ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. గతంలో రూ.300 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1000 దాటిందని విమర్శించారు. సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదని, కమర్షియల్ గ్యాస్ కొరతతో చిన్న వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచుతూ పేదలపై భారాలు మోపడం సరికాదన్నారు. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, రాజు, రాములు, హన్మాండ్లు, అన్సార్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
