

పోతంగల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కొన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోతంగల్ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం మండల ప్రత్యేకాధికారి బాలు అధ్యక్షతన నిర్వహించారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్ లు సభ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యమైన శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను సందర్శించేందుకు వస్తున్న అధికారులు సర్పంచ్ లకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీ సూచించిన లబ్దిదారుల పేర్లు జాబితాలో ఎందుకు లేవని పోతంగల్ సర్పంచ్ సంధ్య ప్రశ్నించారు. ఇళ్ల లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రత్యేకాధికారికి అందచేశారు. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, నిరక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని చేతన్ నగర్, హంగర్గా సర్పంచ్ లు కోరారు. జీపీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జల్లాపల్లి, అబాది సర్పంచ్ లు ఆరోపించారు. సర్పంచ్ ఫోన్లు కూడా ఎత్తకపోతే గ్రామ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు.
ఉదయం వేళల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా చూడాలని కల్లూర్ సర్పంచ్ రామ్ రెడ్డి కోరారు. ఇసుక రవాణాతో రహదారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొడిచర్ల, కల్లూర్ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులకు సమాచారం అందిస్తే.. ఆ విషయం వెంటనే అక్రమ రవాణాదారులకు చేరుతోందని కొందరు సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ, వైద్య, పోలీస్ శాఖల తీరుపై సర్పంచ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక లైసెన్స్ తో నాలుగైదు కల్లు దుకాణాలు నడిపిస్తున్నారని. బెల్ షాపులను అరికట్టాలని చర్యలు తీసుకోవాలని కోరారు.
సమన్వయంతో పనిచేయాలి
మండల ప్రత్యేకాధికారి బాలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి అధికారులు, సర్పంచ్ లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభలో ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా I పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో చందర్ నాయక్, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు షాజి పటేల్, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

