రెండో రోజు కొనసాగిన వివోఏల సమ్మె

రుద్రూర్ :  డిమాండ్ల సాధనకై ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వివోఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న స్వల్ప వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, సాధారణ ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విఓఏల సంఘం అధ్యక్షురాలు జరినా, కార్యదర్శి జి. స్వరూప, ఉపాధ్యక్షురాలు జిజియాబాయి, సహాయ కార్యదర్శి  నాగరాణి, కోశాధికారి లావణ్య,  సభ్యులు వీరేశం , గంగారాం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు..