
కోటగిరి: సమాజ సేవలో భాగంగా టీజీ ఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుమ్మడి ఫౌండేషన్‌కు ఆర్థిక సహాయం అందజేశారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు ప్రతి నెల తమ జీతాల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత ఏడాది నుంచి స్వచ్ఛంద సంస్థలకు ఏడాది పాటు నెలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక చేయూత అందిస్తున్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏడాది 11 స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం కోటగిరి మండలం ఎక్లాస్‌పూర్ గుమ్మడి ఫౌండేషన్‌కు ఏడాది పాటు ప్రతి నెల రూ.20 వేల చొప్పున అందించే తొలి చెక్కును విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఈ పి.వి. రాజేశ్వరరావు అందజేశారు.
అనాథ బాలలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న గుమ్మడి ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈ (ఆపరేషన్) ఎం.డి. ముక్తార్, డీఈ (టెక్నికల్) వెంకటరమణ, ఏడీఈ తోట రాజశేఖర్, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజేందర్ గౌడ్, వేణుగోపాల్, గంగారాం నాయక్, సురేష్ కుమార్, స్థానిక ఏఈ బుజ్జిబాబు, గుమ్మడి ఫౌండేషన్ ప్రతినిధి బాల ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
