డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన

రుద్రూర్: ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ (సీఎఫ్‌ఎస్‌టీ), లో  గురువారం తెలంగాణ పోలీసు శాఖ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో  మాదకద్రవ్యాల నిర్మూలనపై  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈగల్ టీం డిఎస్పి సోమనాథం  మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించారు. ఆసక్తి, స్నేహితుల ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడికి లోనై మాదకద్రవ్యాల బారిన పడొద్దని సూచించారు.  అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా కళాశాల అధికారులకు సమాచారం అందించాలని కోరారు.  యువత దేశ భవిష్యత్తని పేర్కొంటూ విద్యార్థులు విద్య, క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్‌, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. “డ్రగ్ ఫ్రీ క్యాంపస్ – డ్రగ్ ఫ్రీ సొసైటీ – డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

కళాశాలఅసోసియేట్ డీన్ డా. కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ .. కళాశాలలో మాదకద్రవ్యాల రహిత, సురక్షిత విద్యా వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో  బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఈగల్ టీమ్ సీఐ పూర్ణేశ్వర్, ఎస్‌ఐ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ వ్యతిరేక  అవగాహన పోస్టర్లు ఆవిష్కరిస్తున్న దృశ్యం