
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవయుగ గణేష్ మండలి 52వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండపంలో ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అనంతరం కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి కుంకుమ సమర్పించారు. మండపం పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గణనాథుడి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
