
రుద్రూర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి రుద్రూర్ చెరువు కట్ట వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహారాష్ట్రలోని పండరీపూర్ క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ స్థానిక భక్తులు రుద్రూర్ చెరువును పవిత్ర చంద్రభాగ నదిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం వేళ చెరువు కట్ట వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు గంగమ్మ తల్లికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మంగళహారతులు ఇస్తూ, సామూహికంగా దీపాలను నీటిలో వదిలారు. దీపాల వెలుగుల్లో చెరువు పరిసరాలు శోభాయమానంగా మారాయి. పాండురంగ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
