చిక్కడపల్లిలో ఘనంగా బోనాల పండుగ

రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో ఆదివారం బోనాల పండుగను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనాలు ఎత్తుకుని భాజాభజంత్రీల నడుమ ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను వైభవంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ మచ్కూరి రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్మరాజు, కార్యదర్శి గోపి, సలహాదారులు రాజయ్య, డాక్టర్ మల్లేష్, కోశాధికారి జెల్ల పరమేష్, సభ్యులు కృష్ణార్జున్, కోలా శ్రీను, కొందరు అంజయ్య, సాయినాథ్, మాజీ సర్పంచ్ పుష్పలత రమేష్, పెద్ద హన్మంతు, గుడిసె హన్మంతు, జెల్ల సాయిలు, రవి, బస్వయ్య, అశోక్,కరణ్, అరుణ్, కార్తీక్, నవీన్, మాచుకూరి రాము తదితరులు పాల్గొన్నారు.